🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 18 Sep, 2026 | Page: 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలు మెరుగుపర్చాలి అన్ని సూచికల్లో మెరుగైన పనితీరు సాధించాలని అధికారులకు డీఎంహెచ్‌ఓ ఆదేశం

వరంగల్, సెప్టెంబర్ 18: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి శుక్రవారం పరిశీలించారు. డీఈఐసీ, యూఎఫ్‌డబ్ల్యూసీ, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ తదితర విభాగాలను సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రికార్డులు, నివేదికల నిర్వహణను పరిశీలించారు.

ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ విభాగాల్లో శిశువులు, చిన్నారులకు అందుతున్న వైద్య సంరక్షణ, పోషకాహారం, తదుపరి వైద్య పర్యవేక్షణ, రిఫరల్ సేవలను సమీక్షించారు. డీఈఐసీలో ఆర్‌బీఎస్‌కే ద్వారా రిఫర్‌ అవుతున్న చిన్నారుల్లో అభివృద్ధి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన పరీక్షలు, చికిత్స, తదుపరి పర్యవేక్షణ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు.

యూఎఫ్‌డబ్ల్యూసీలో మహిళలకు అందుతున్న ఆరోగ్య సేవలు, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలు, సూచికలను సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, సేవల్లో లోపాలకు తావులేకుండా చూడాలని, లబ్ధిదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.

ఆరోగ్య మందిరంలో ప్రతిజ్ఞ

అనంతరం తిమ్మాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డా. రాజారెడ్డి సందర్శించి అక్కడ అందుతున్న ఆరోగ్య సేవలను పర్యవేక్షించారు. సేవల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పేషెంట్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా సిబ్బంది, రోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో కార్యక్రమ అధికారి (సీహెచ్‌ఐ), డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ప్రకాష్, డీపీఓ అర్చన తదితరులు పాల్గొన్నారు.
🏠 Home