🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 20 Sep, 2026 | Page: 1

ఉద్యమకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలి గుడిమల్ల రవికుమార్

*తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 19*

వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకుడు గుడిమల్ల రవికుమార్ డిమాండ్ చేశారు.తెలంగాణ ఓదార్పు యాత్రలో భాగంగా మూడో రోజు శ్రీనివాస్ కాలనీ,దేశాయిపేట,ఎల్‌బీనగర్,లోతుకుంట, చార్బౌలి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమకారులను కలుసుకున్నారు.వారి కుటుంబాల పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ కోసం 25 ఏళ్ల క్రితం ఉద్యమించిన అనేక మంది ఉద్యమకారులు నేటికీ అదే దుస్థితిలో జీవించడం బాధాకరమన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు తగిన గుర్తింపు, పదవులు,ఉద్యోగాలు,ఆర్థిక భరోసా లభించలేదని పేర్కొన్నారు.ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,అలాంటి వారిని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదన్నారు.ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు 250 గజాల స్థలం,నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని,ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా హామీలు అమలు కాలేదని అన్నారు.ప్రభుత్వం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.గత ప్రభుత్వం ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసి,వారి కుటుంబాల పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్లే ఆ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని రవికుమార్ పేర్కొన్నారు.ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉద్యమకారులను విస్మరిస్తే ప్రజల నుంచి తగిన సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఉద్యమకారులను కించపరిచేలా వ్యవహరించడం,చిన్నచూపు చూడటం సహించబోమన్నారు.కార్యక్రమంలో శ్యామ్ కృష్ణ,చాంద్ పాషా,అమ్జద్,నెల్సన్,మనోహర్, రాజ్‌మౌళి,ఇమ్రాన్,రాజు,మేకల కృష్ణ,దేవునూరి రాజు రవి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home