తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి ఉద్యమకారుల ఓదార్పుతో వారి జీవిత స్థితిగతులు తెలుస్తున్నాయి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక చైర్మన్ గుడిమల్ల రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా తొలి దశ మలిదశ ఉద్యమకారుల కోసం ఓదార్పు యాత్ర జరుగుతుందని ఈ ఓదార్పు యాత్ర వల్ల ఆనాటి ఉద్యమకారుల స్థితిగతులు స్పష్టంగా అర్థం అవుతున్నాయని అన్నారు. తొలి రోజు 25 మందిని సన్మానం చేశామని ఇప్పటివరకు 75 మందిని సన్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చినందుకు సంతోషం లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు రవికుమార్ వివరించారు. అందరూ బాధలో ఉన్నారని ఎలాంటి సంక్షేమ ఫలాలు అందక ఆవేదన పడుతున్నట్లు తెలిపారు. గత 12 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. వారి త్యాగం గొప్పది అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అధికారులు పట్టించుకోవాలని ఈ సందర్భంగా రవికుమార్ కోరారు. లేదంటే మరో ఉద్యమం కోసం అడుగులు వేయాల్సి వస్తుందని తెలిపారు. ఉద్యమకారులందరినీ ఐక్యం చేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాకుండా వారికి రావలసినటువంటి ఫలాలు అందే వరకు తాము పోరాటం చేస్తామని గుడిమల్ల రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు చాంద్ పాషా, బొలిశెట్టి అశోక్, నారాయణరెడ్డి, రాజమౌళి, కుమారస్వామి, నెల్సన్, కేడల ప్రసాద్, నటరాజ్, రమేష్, రవీందర్, ఇమ్రాన్, స్వర్ణలత, శ్యామ్, స్వామి యాదవ్, మాధవి లత, సతీష్ తదితరులు పాల్గొన్నారు.