🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 20 Sep, 2026 | Page: 1

జనహితమే గణనాథుడి సేవ ప్రజా సంక్షేమం కోరుతూ ఈగ మల్లేశం ప్రత్యేక పూజలు

వర్ధన్నపేట, సెప్టెంబర్ 19: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫిరంగడ్డ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాన్ని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ.. సకల విఘ్నాలను తొలగించి, ప్రజలకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేసేందుకు గణేశ్ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఫిరంగడ్డ యూత్ అసోసియేషన్ సభ్యులు క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో గణనాథుడి మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈగ మల్లేశం పేర్కొన్నారు. యువత ఇదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. గణనాథుడి ఆశీస్సులతో వర్ధన్నపేట ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.
అనంతరం ఫిరంగడ్డ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈగ మల్లేశంను శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కరిమిల్ల సంపత్ రావు, రవీందర్ రెడ్డి, బక్కతట్ల రాజు యాదవ్, పూజారి శ్రీనివాస్, బిక్కినేని వెంకన్న, ఓర్సు వెంకన్న, శివరాత్రి తిరుపతి, దాసరి బిక్షపతి, జూలూరి శ్యామ్, పొన్నం వేణు, కోల అశోక్, దాసరి శంకర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
🏠 Home