🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 21 Sep, 2026 | Page: 1

నిమజ్జనం వేళ అప్రమత్తంగా ఉండాలి వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య..రాయపర్తి మంచినీళ్ల చెరువు పరిశీలన

తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 21
రాయపర్తి: వినాయక నిమజ్జనాల సందర్భంగా ఉత్సవ కమిటీలు,ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు.రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో గణపతి నిమజ్జనాలు జరిగే చెరువులు,కుంటల వద్ద గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీలు వినాయక శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో చీకటి పడకముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.శోభాయాత్రల్లో డీజేలు,సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతులు లేవని,నిబంధనలు ఉల్లంఘించి వినియోగిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.గణపతి ఊరేగింపుల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మద్యం మత్తులో వాహనాలు నడపడం,అసభ్యకరంగా నృత్యాలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తారని పేర్కొన్నారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సీఐ సంజీవరావు,ఎమ్మార్వో శ్రీనివాస్,ఎంపీడీవో పాక శ్రీనివాసులు,గిర్దావర్ కొయ్యాడ చంద్రమోహన్,రాయపర్తి పంచాయతీ కార్యదర్శి యాకూబ్ నాయక్‌లతో కలిసి ఏసీపీ అంబటి నర్సయ్య రాయపర్తిలోని మంచినీళ్ల చెరువును పరిశీలించారు.నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ పాల్గొన్నారు.
🏠 Home