🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 30 Oct, 2026 | Page: 1

బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం 150 యూనిట్ల రక్తం సేకరణ – యువత స్వచ్ఛందంగా రక్తదానం

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో మామునూరు ఉపవిభాగ పోలీసులు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ రక్తదాన శిబిరాన్ని వరంగల్ తూర్పు జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆధ్వర్యంలో పండ్లు, పండ్ల రసాలు, ఇతర అల్పాహార పదార్థాలను అందజేశారు.

ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ, సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రక్తదానం అనేది ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవ అని తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, ఎంజీఎం ఆసుపత్రి వైద్య బృందం, వాగ్దేవి కళాశాల ఫార్మసీ విభాగ ప్రిన్సిపాల్ కమల్ యాదవ్, మామునూరు, ఏనుమాముల, గీసుకొండ పోలీస్ స్టేషన్ల సీఐలు, సంగెం, పర్వతగిరి, ఏనుమాముల, మామునూరు ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home