ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
హనుమకొండ జిల్లా పరిధిలోని వంగర, ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ఆరోగ్య కేంద్రాల్లోని మందుల నిల్వలు, మందుల పంపిణీ వివరాలు, ప్రయోగశాల రికార్డులు, వివిధ రిజిస్టర్ల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని వైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు, సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అంటువ్యాధులు కాని వ్యాధుల గుర్తింపు కోసం ప్రజలకు విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధులు గుర్తించిన వారికి సకాలంలో చికిత్స అందించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించాలని తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు, లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పొడి దినాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని డాక్టర్ అప్పయ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వంగర వైద్యాధికారులు డాక్టర్ రహమాన్, డాక్టర్ రూబీనా, ముల్కనూరు వైద్యాధికారి డాక్టర్ ముజీబ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.