🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 05 Nov, 2026 | Page: 1

కల్తీ కారం, పసుపు పొడి నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడి

కల్తీ కారం, పసుపు పొడి నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడి

రూ.5.92 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం – ఒకరి అరెస్ట్

వరంగల్, నవంబర్ 5:

వరంగల్ నగరంలోని మట్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాల నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆహార భద్రతా శాఖ అధికారులతో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో కల్తీ కారం పొడి, పసుపు పొడిని నిల్వ ఉంచిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మొత్తం రూ.5,92,500 విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి, నిందితుడి వద్ద ఉన్న 600 కిలోల కారం పొడి, 1,650 కిలోల పసుపు పొడిని గుర్తించి స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ సుమారు రూ.5,92,500గా అధికారులు అంచనా వేశారు.

తనిఖీల్లో వెలుగుచూసిన ఉల్లంఘనలు:

వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆహార భద్రతా అనుమతి పత్రం లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాలను తప్పనిసరి వివరాలతో కూడిన లేబుళ్లు లేకుండా ప్యాకింగ్ చేస్తున్నట్లు తేలింది. నిల్వ కేంద్రంలోని గోడలు దుమ్ముతో నిండి ఉండటంతో పాటు, ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ పనులు అపరిశుభ్ర వాతావరణంలో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే ఆహార పదార్థాలను నిర్వహించే సిబ్బంది తల టోపీలు, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు ధరించకపోవడం, సిబ్బందికి సంబంధించిన వైద్య ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

నిందితుడి వివరాలు:

అకుతోట గోపి (42), తండ్రి సాంబయ్య, వృత్తి వ్యాపారం, నివాసం కరీమాబాద్, వరంగల్‌గా పోలీసులు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలతో పాటు నిందితుడిని వరంగల్ ఆహార భద్రతాధికారి చి. మౌనికకు అప్పగించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. క్రాంతికుమార్, ఎస్‌ఐ కె. సుధాకర్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఆహార భద్రతా శాఖ అధికారుల సమన్వయంతో ఈ తనిఖీలు నిర్వహించారు.
🏠 Home