🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 11 Nov, 2026 | Page: 1

రంగాపూర్ ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఐదు క్వింటాళ్ల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

రంగాపూర్ ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్

ఐదు క్వింటాళ్ల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు – గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన

తాడ్వాయి, నవంబర్ 10:

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. పస్రా సీఐ ఆధ్వర్యంలో తాడ్వాయి, నర్లాపూర్, పస్రా ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలు జరుగుతున్న స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీకి ఉపయోగించే సుమారు ఐదు క్వింటాళ్ల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే గ్రామంలోని ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. గ్రామంలో కొత్త వ్యక్తుల సంచారం, అనుమానాస్పద కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టారు.

అనంతరం గ్రామస్తులతో సమావేశమైన పోలీసులు గుడుంబా తయారీ, విక్రయాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని వివరించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు తెలియజేయవద్దని, అనుమానాస్పద లింకులను తెరవవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా గుడుంబా తయారీ, విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తుల సంచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

ప్రజలు పోలీసులకు సహకరించి తమ గ్రామాన్ని నేరరహితంగా, ప్రశాంతంగా, సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని అధికారులు కోరారు.
🏠 Home