🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 11 Aug, 2026 | Page: 1

అక్టోబర్ 9న హైదరాబాద్‌లో లక్ష మందితో బహుజన సమర సభ

నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ పిలుపు

నల్గొండ: నల్గొండ జిల్లా బీఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, బహుజనుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మాన్యవర్ కాన్షీరామ్ గారి వర్ధంతి సందర్భంగా భారీ బహుజన సమర సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని ఇబ్రహీం శేఖర్ కోరారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా బహుజనులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

లక్ష మందితో భారీ బహుజన సమర సభ నిర్వహించి బహుజనుల ఐక్యత, హక్కులు, రాజ్యాధికార సాధనకు తమ బలాన్ని చాటాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

సభను విజయవంతం చేసేందుకు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, బహుజన సమాజాన్ని చైతన్యపరిచి సభకు తరలించే బాధ్యతను ప్రతి నాయకుడు, కార్యకర్త తీసుకోవాలని ఆయన అన్నారు.

సమీక్ష సమావేశంలో బీఎస్పీ జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home