🏠 www.janacharitra.online
Watermark
Newspaper Logo
www.janacharitra.online | Date: 19 Aug, 2026 | Page: 1

పరకాలలో SIR ప్రక్రియపై BLAలకు అవగాహన

వరంగల్ జిల్లా/పరకాల, ఆగస్టు 19: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడి ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన పరకాల టౌన్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై BLAలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జీలు, MLC శంకర్ నాయక్, మహమ్మద్ నాసర్తో కలిసి అయూబ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ఓటర్ల వివరాల పరిశీలన, ధృవీకరణ, క్లెయిమ్స్, అభ్యంతరాలు తదితర అంశాలపై BLAలకు పలు సూచనలు చేశారు.
ASDD కేటగిరీలో గుర్తించిన ఓటర్ల విషయంలో BLAలు అప్రమత్తంగా ఉండాలని అయూబ్ సూచించారు. ఉద్యోగం, విద్య, ఉపాధి తదితర కారణాలతో తాత్కాలికంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని కేవలం ఇంటి వద్ద అందుబాటులో లేరనే కారణంతో ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా వాస్తవాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.
ప్రతి ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా BLAలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని అయూబ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండల, డివిజన్, టౌన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, BLAలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home