EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్న అరెస్ట్

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Sep 2026, 08:51 PM | TELANGANA, వరంగల్
    తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్న అరెస్ట్

    24 గంటల్లో కేసును ఛేదించిన గీసుగొండ పోలీసులు..కత్తి,రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం

    *తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 21*

    గీసుగొండ: గరీబ్‌నగర్‌లో తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన అన్నను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ హత్య కేసును 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.గరీబ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఈ నెల 19న రాత్రి సుమారు 9.30 గంటలకు ఎలుబాక ప్రసాద్(31)కత్తిపోట్లకు గురై మృతి చెందాడు.మృతుడి ఛాతి,వీపు,భుజంపై తీవ్ర గాయాలు గుర్తించారు.మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా మృతుడి అన్న ఎలుబాక ప్రవీణ్(33)ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.తల్లి వద్ద తరచూ డబ్బులు అడిగే ప్రవీణ్‌ను ప్రసాద్ గతంలో పలుమార్లు మందలించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది.దీంతో ప్రసాద్‌పై కక్ష పెంచుకున్న ప్రవీణ్..తల్లి సంపాదించే డబ్బు తనకే దక్కాలనే ఉద్దేశంతో తమ్ముడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.వెల్డర్‌గా పనిచేసే ప్రవీణ్ తాను తయారు చేసుకున్న కత్తిని వెంట తీసుకుని 19వ తేదీ రాత్రి గరీబ్‌నగర్‌లోని తల్లి,తమ్ముడు ఉంటున్న ఇంటికి వెళ్లాడు.ఆ సమయంలో తల్లి నైట్ డ్యూటీకి వెళ్లగా ప్రసాద్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.కావాలనే ప్రసాద్‌తో గొడవకు దిగి,కత్తితో అతడి వీపు,ఛాతి,భుజంపై పలుమార్లు పొడిచాడు.తీవ్ర రక్తస్రావంతో ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలాడు.ఇరుగుపొరుగువారు 108కు సమాచారం ఇవ్వగా,అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి ప్రసాద్ మృతి చెందినట్లు నిర్ధారించారు.తమ్ముడిపై దాడి సమయంలో జరిగిన పెనుగులాటలో ప్రవీణ్ ఎడమ బొటనవేలుకు కూడా గాయమైంది.అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పిన ప్రవీణ్ తిరిగి తల్లి వద్దకు వచ్చాడు.తల్లి ప్రసాద్ మృతదేహం వద్ద ఏడుస్తుండగా..“ఏడిస్తే నిన్ను కూడా చంపుతాను.తమ్ముడిని చంపింది నేనే”అంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన ప్రవీణ్ 20వ తేదీ తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో గీసుగొండలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు.గాయానికి కారణం అడగగా తమ్ముడిని కత్తితో పొడిచిన సమయంలో తన చేతికి గాయమైందని వైద్యుడికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.ప్రాథమిక చికిత్స అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోవాలని వైద్యుడు సూచించాడు.ఈ క్రమంలో 21వ తేదీన నిందితుడు తన ఇంటి వైపు వస్తున్నట్లు సమాచారం అందడంతో గీసుగొండ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో నేరాన్ని అంగీకరించిన ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో అతని ఇంటి సమీపంలోని పొదల్లో దాచిన హత్యకు ఉపయోగించిన కత్తి,రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈస్ట్ జోన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించింది.స్వాధీనం చేసుకున్న వస్తువులకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు.అనంతరం నిందితుడు ఎలుబాక ప్రవీణ్(33)ను రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.కేసును వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన గీసుగొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్,ఎస్‌ఐలు అనిల్ కుమార్,కుమార్,కానిస్టేబుళ్లు అరవింద్,విజయ్,ప్రవీణ్,భాస్కర్,రజినీకుమార్‌లను పోలీసు అధికారులు అభినందించారు.

    ఇవి కూడా చదవండి