EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంజీఎం సమస్యలు పరిష్కరించాలి వినయ్ భాస్కర్‌పై పోలీసుల దౌర్జన్యం అప్రజాస్వామికం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 04:59 PM | TELANGANA, వరంగల్
    ఎంజీఎం సమస్యలు పరిష్కరించాలి వినయ్ భాస్కర్‌పై పోలీసుల దౌర్జన్యం అప్రజాస్వామికం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

    *తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 24*

    వరంగల్: ప్రజా సమస్యలపై ప్రశ్నించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్రమంగా అరెస్టులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వరంగల్‌లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలకుల అండతో నగరంలో సరికొత్త దాడుల సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు.ఎంజీఎంలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు పనిచేయకపోవడం,ల్యాబ్‌లు మూతపడటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.కమీషన్ల కోసం రోగులను ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యులు డ్యూటీలకు గైర్హాజరవుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని నరేందర్ అన్నారు.సుమారు 600 మంది సిబ్బంది అవసరమైన చోట సగం మందితోనే సేవలు కొనసాగుతున్నాయని,దీంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ వైద్య వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.గత ప్రభుత్వం నిర్మించిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని నరేందర్ ప్రశ్నించారు.నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తక్షణమే ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు టి.రమేష్‌బాబు,కె.రాజేందర్,కొంతం మోహన్,బజ్జూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.