EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో విద్యార్థులకు బాలల హక్కులు, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Nov 2026, 08:04 AM | TELANGANA, వరంగల్
    సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో  విద్యార్థులకు బాలల హక్కులు, బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి కందుకూరి. పూజ అధ్యక్షతన నిర్వహిస్తున్న "సురక్షిత్ బచ్పన్ అభియాన్" ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా పర్వతగిరి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు బాలల హక్కులు, బాలల భద్రత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ చైర్‌పర్సన్, వి.బి. నిర్మల గీతాంబ మాట్లాడుతూ "జాతీయ న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. పిల్లలు ఎలాంటి వేధింపులకు గురికాకుండా సురక్షితమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు, బాల్యవివాహాలు వంటి సామాజిక సమస్యలను అరికట్టేందుకు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం ప్రతి విద్యార్థికి తన హక్కులపై అవగాహన కల్పించడం, బాలలపై జరిగే నేరాలను ముందుగానే గుర్తించడం, వాటిని నివారించడం మరియు పిల్లలు భయంలేని సురక్షితమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా చేయడం అని తెలియజేశారు.
    జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి కందుకూరి పూజ మాట్లాడుతూ"సురక్షిత్ బచ్పన్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయిలో పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమమని తెలిపారు. ముఖ్యంగా పోక్సో చట్టం, 2012 గురించి వివరించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ చట్టం కల్పించే రక్షణ, బాలలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, బాధిత పిల్లలకు అందించే న్యాయ సహాయం గురించి వివరించారు. పిల్లలు తమపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా మౌనంగా ఉండకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి లేదా న్యాయ సేవాధికార సంస్థల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధిత పిల్లలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
    విద్యాసంస్థల్లో విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ఉపాధ్యాయుల బాధ్యత అని వివరించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు, మానసిక ఇబ్బందులు లేదా ఏవైనా వేధింపులకు సంబంధించిన సమస్యలు కనిపించినప్పుడు ఉపాధ్యాయులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.
    పర్వతగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ "బాలల భద్రతలో పోలీస్ శాఖ పాత్రను వివరిస్తూ, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. బాలలపై వేధింపులు, బాల్యవివాహాలు, అక్రమ రవాణా మరియు ఇతర నేరాలకు సంబంధించిన విషయాలను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని తెలిపారు.
    షీ టీమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు మాట్లాడుతూ "పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు ఎదుర్కొనే వేధింపులు, ఈవ్ టీజింగ్, అసభ్యకర ప్రవర్తన వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, బాలికల రక్షణకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్కిట్స్ రూపంలో వివరించారు. వివరించారు.
    సైబర్ క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ "ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఎదుర్కొనే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగం, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపులు, నకిలీ ఖాతాలు, వ్యక్తిగత ఫొటోలు మరియు సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాలను వివరించారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలను ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఆన్‌లైన్‌లో ఏదైనా వేధింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.
    ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా వరంగల్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఆర్.సురేష్, పి.శ్రీనివాస రావు, ఆర్.రజినీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
    ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బాలల హక్కులు, పోక్సో చట్టం, బాల్యవివాహాల నిషేధం, బాలలపై జరిగే లైంగిక నేరాల నివారణ, సైబర్ భద్రత, మహిళలు మరియు బాలికల రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
    ఈ కార్యక్రమాల్లో సంబంధిత విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
    జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్