EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Nov 2026, 08:08 AM | TELANGANA, వరంగల్
    బాలల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

    పిల్లల హక్కులు, మహిళల భద్రత, అక్రమ రవాణాపై అవగాహన కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ

    పర్వతగిరి: వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల రక్షణ, మహిళల భద్రత, మహిళలు మరియు బాలల అక్రమ రవాణా నివారణపై ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. పూజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె. పూజ మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుకోవడంతో పాటు బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలని, అవసరమైతే షీ టీమ్ పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వారి వివరాలను రాసి అందులో వేయాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

    ముఖ్య అతిథి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని సూచించారు. బాలల రక్షణకు, సంక్షేమానికి ఆటంకం కలిగినప్పుడు అత్యవసర సహాయం కోసం 112, బాలల సహాయ కేంద్రం 1098 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. మహిళలు, బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను చిన్న చిన్న కథల ద్వారా వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

    పర్వతగిరి సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా తెలియజేయాలని కోరారు.

    ఇవి కూడా చదవండి

    షీ టీమ్ ఎస్ఐ రామారావు మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే సమయంలో ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్ ఎదురైతే వెంటనే షీ టీమ్‌ను ఆశ్రయించాలని సూచించారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలు, రీల్స్ చూసి అపరిచితుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

    మహిళలు, బాలల అక్రమ రవాణా వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూ అక్రమ రవాణాకు గురైన పిల్లలను భిక్షాటనకు ఉపయోగించడం, మహిళలను వ్యభిచారంలోకి నెట్టడం వంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

    జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ స్వచ్ఛంద కార్యకర్త సురేష్ మాట్లాడుతూ బాలల రక్షణ, సంక్షేమం కోసం రాజ్యాంగం అనేక హక్కులు కల్పించిందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా 15100 ఉచిత న్యాయ సహాయ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహాయం పొందవచ్చని వివరించారు.

    ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ శివకుమార్, షీ టీమ్ ఎస్ఐ యాదగిరి, హెడ్ కానిస్టేబుళ్లు యాదగిరి, వంశీకృష్ణ, ఇమ్రాన్, న్యాయ స్వచ్ఛంద కార్యకర్తలు సురేష్, పి.పి. శ్రీనివాస్, రజిని, మండల విద్యాశాఖ అధికారి, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, పాఠశాల ప్రిన్సిపల్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కరుణశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించిన విషయాలను విద్యార్థులందరూ తప్పనిసరిగా పాటిస్తూ, తమ భద్రత పట్ల అవగాహనతో ఉండాలని కోరారు.